ప్రతిపక్షం, ఆగస్టు 22: ప్రపంచ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ జోలనీ టెటే(38) దారుణ హత్యకు గురయ్యారు. దక్షిణాఫ్రికాలోని ఈస్టర్న్ కేప్ ప్రాంతం డాంట్‌సేన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట కారులో ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు సమాచారం.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జోలనీ టెటే అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. అదే కారులో ఉన్న 27 ఏళ్ల మహిళకు కూడా బుల్లెట్ గాయాలు కాగా, ఆమె తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, కాల్పులకు పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
బాక్సింగ్ ప్రపంచంలో జోలనీ టెటేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2007 నుంచి 2008 వరకు డబ్ల్యూబీఎఫ్ ఫ్లైవెయిట్ ప్రపంచ టైటిల్‌ను ఆయన తన వద్ద ఉంచుకున్నారు. అనంతరం బాంటమ్‌వెయిట్ విభాగంలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచారు. 2017, 2019 సంవత్సరాల్లో డబ్ల్యూబీవో బాంటమ్‌వెయిట్ టైటిళ్లను సొంతం చేసుకున్నారు.
ముఖ్యంగా తన ప్రత్యర్థిని కేవలం 11 సెకన్లలోనే నాకౌట్ చేసిన రికార్డు జోలనీ టెటే కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన ఘనతగా నిలిచింది. ఈ ప్రదర్శన గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోనూ నమోదైంది.
ప్రపంచ బాక్సింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టెటే హత్యకు గురికావడం క్రీడా వర్గాల్లో విషాదాన్ని నింపింది. కాల్పులకు గల కారణాలు, దుండగుల వివరాలు, ఘటన వెనుక ఉన్న నేపథ్యంపై దక్షిణాఫ్రికా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





























