ప్రతిపక్షం, ఆగస్టు 22, హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతిచెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్రీయ సమితి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 50 గజాల స్థలంలో ఇంత భారీ నిర్మాణం జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమని ఆమె పేర్కొన్నారు.
అక్రమ నిర్మాణం కొనసాగుతున్న విషయాన్ని అధికారులు గుర్తించలేదా? గుర్తించినా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని కవిత అన్నారు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనం నిర్మిస్తున్న సమయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
అక్రమంగా భవనం నిర్మించిన యజమానిపై మాత్రమే కాకుండా, నిర్మాణాన్ని అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ సమయంలోనే అధికారులు నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేదని కవిత పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు.





























