ప్రతిపక్షం, ఆగస్టు 27: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బండ్లగూడ జాగీర్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణవేణి (32), కృష్ణ దంపతులు బండ్లగూడ జాగీర్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కృష్ణవేణి మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, ప్రాథమికంగా అందిన సమాచారంతో ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. భర్తపై ఉన్న ఆరోపణలు, దంపతుల మధ్య చోటుచేసుకున్న వివాదాలపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.





























