[t4b-ticker]

‘డిఫెన్స్’ కంపెనీ స్టార్ట్ చేసిన పొంగులేటి కుమారుడు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు లిఖిత్‌రెడ్డి రక్షణ రంగంలోకి అడుగుపెట్టారు. రక్షణ పరికరాల తయారీ రంగంలో వ్యాపార కార్యకలాపాలు చేపట్టేందుకు ‘రాఘవ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

ఈ సంస్థ ప్రధానంగా రక్షణ రంగంలో వినియోగించే డ్రోన్ల తయారీపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేసి, రక్షణ అవసరాలకు అనుగుణంగా వాటిని తయారు చేయనున్నట్లు వివరించారు. దేశీయంగా రక్షణ పరికరాల తయారీని ప్రోత్సహించాలనే లక్ష్యంతో సంస్థ కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.

రాఘవ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ సంస్థ తయారు చేయనున్న డ్రోన్లు ప్రత్యేక సామర్థ్యాలతో రూపొందనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో డ్రోన్‌ సుమారు 300 కిలోల వరకు పేలోడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ, సుమారు 30 గంటల పాటు నిరంతరంగా పనిచేసేలా వాటిని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.

రక్షణ రంగంలో నిఘా, పర్యవేక్షణ, ఇతర అవసరాల కోసం డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇటువంటి పరికరాల తయారీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాఘవ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా దేశీయ రక్షణ పరికరాల తయారీ రంగంలోకి లిఖిత్‌రెడ్డి ప్రవేశించినట్లైంది.

అధిక పేలోడ్‌ సామర్థ్యం, ఎక్కువ ఎత్తులో ప్రయాణించడంతో పాటు దీర్ఘకాలం గాల్లోనే పనిచేసే సామర్థ్యంతో డ్రోన్లను రూపొందించనున్నట్లు మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం సంస్థ భవిష్యత్‌లో రక్షణ రంగానికి అవసరమైన మరిన్ని సాంకేతిక పరికరాల అభివృద్ధిపైనా దృష్టి సారించే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News