*రైతులకు ప్రాణరక్షక తడులు, 2% యూరియా పిచికారీ సూచన – ఏఈఓ పద్మజ.
*DCS సర్వే ఆధారంగానే పంటల కొనుగోలు, సబ్సిడీలు – సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం.
*చండూరు మండల వ్యవసాయ అధికారి (AO) మల్లేష్ .
ప్రతి పక్షం చండూరు, సెప్టెంబర్ 03: చండూరు మండలం శిర్ధేపల్లి గ్రామంలోని పత్తి పొలాలను బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులు సందర్శించారు. ప్రస్తుత పంట పరిస్థితిపై రైతులతో ముఖాముఖి మాట్లాడారు. తేమ ఒత్తిడి కారణంగా చాలా పత్తి పొలాలు వాడిపోతున్నట్లు గమనించారు.
ఈ సందర్భంగా రైతు సోదరులకు పలు సూచనలు చేశారు. అవకాశం ఉన్నచోట ప్రాణరక్షక నీటి తడులు ఇవ్వాలని, అలాగే పంట కోలుకోవడానికి 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలని సిఫార్సు చేశారు. పంటను కాపాడుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులకు వివరించారు.
అనంతరం డిజిటల్ పంటల బుకింగ్ సర్వే (DCS) పురోగతిని పరిశీలించారు. ఈ సర్వే డేటా ఆధారంగానే పంటల కొనుగోలు మరియు ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలు ఆధారపడి ఉంటాయని, అందువల్ల సర్వేను సకాలంలో మరియు కచ్చితంగా పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారిని మరియు DCS వాలంటీర్ ను ఆదేశించారు. అలాగే జిల్లాలో అన్ని రకాల ఎరువుల అమ్మకం యాప్ ఫ్రేమ్ వర్క్ మరియు బుకింగ్ విధానం ద్వారా నిన్నటి నుండి అమ్మకాలు ప్రారంభమయ్యాయని, ఆ విధానం గురించి రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) పద్మజ, DCS వాలంటీర్, ప్రగతిశీల రైతు జోగిరెడ్డి మరియు ఇతర రైతులు పాల్గొన్నారు.






























