Trending Now

కాంగ్రెస్​ vs​ బీఆర్​ఎస్.. జీహెచ్​ఎంసీ కౌన్సిల్​ సమావేశంలో దూషణలు

ప్రతిపక్షం, హైదరాబాద్ స్టేట్​బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ మహానగర పాలక సంస్థ కౌన్సిల్​ సమావేశం రసాబాసగా మారింది. చాలా రోజుల తర్వాత జరిగిన కౌన్సిల్​ సమావేశంలో అధికార కాంగ్రెస్​, విపక్ష బీఆర్​ఎస్​ సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య దద్దరిల్లింది. సోమవారం మేయర్​ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య బాహాబాహీ నడిచింది. జీహెచ్‌ఎంసీ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు.

అన్నీ సమస్యలే: అరికపూడి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో అన్ని సమస్యలే అని.. జీహెచ్ఎంసీ వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. పాలన పడకేసిందన్నారు. కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా వెలగడం లేదని విమర్శించారు. హైదరాబాద్ పరువు పోతుందన్నారు. జీహెచ్‌ఎంసీలో పని చేయడం కోసం డబ్బులు లేవు, అధికారులు లేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ కార్పొరేటర్లు తప్పుబట్టారు. అధికారులను నిర్లక్ష్యంగా చేసింది, వ్యవస్థలు నిర్వీర్యం అవ్వడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం మారగానే సమస్యలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. మేయర్ పొడియం వద్ద కాంగ్రెస్ కార్పొరేటర్లు నిరసనకు దిగారు.

తొమ్మిదేళ్ల నిర్లక్ష్యమే కారణం: బల్మూరి

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో సమస్యలు ఇప్పటికిప్పుడు పుట్టుకోచ్చినవి కాదన్నారు. తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం లెక్క తాము జీహెచ్‌ఎంసీ పక్కన పెట్టమన్నారు. జీహెచ్‌ఎంసీ అభివృద్ధిపై చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీని గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, గొప్పలు చెప్పారే కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను ఏ మాత్రం పరిష్కరించాలన్న ఆలోచన చేయలేదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతుందన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో జీహెచ్​ఎంసీ నిర్వీర్యం అయ్యిందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇప్పుడు గుర్తించారన్నారు.

కార్పొరేటర్ల ఆగ్రహం.. మేయర్ సమాధానం

కౌన్సిల్ హల్‌లో అధికారుల సమాధానాలపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో స్ట్రీట్ లైట్స్ సమస్య తీవ్రంగా ఉందని కార్పొరేటర్లు తెలిపారు. ఆఫీస్‌లలో కూర్చోని కౌన్సిల్ సమావేశంలో అబద్ధాలు చెప్తున్నారన్నారు. గత ఆరు నెలలుగా అధికారులు కనీసం సమీక్ష చెయ్యలేదన్నారు. కార్పొరేటర్ల అసంతృప్తిపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందించారు. ఆయా సమస్యలపై హౌస్ కమిటీ వేద్దామన్నారు. అధికారులు జోనల్ సమావేశాలు కనీసం తనకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. జోనల్ సమావేశాలకు కార్పొరేటర్లకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని మేయర్ ప్రశ్నించారు. జోనల్ వారీగా స్ట్రీట్ లైట్స్ సమస్య ఉంటే కేబుల్ శాంక్షన్ ఇవ్వడం లేదని ఎంఐఎం కార్పొరేటర్లు వెల్లడించారు.

Spread the love

Related News

Latest News