Trending Now

తెలంగాణ తెచ్చిన నన్నే తిరగనివ్వరా?– కేసీఆర్



పదేండ్లలో తెలంగాణకు చెయ్యాల్సింది చేశాం
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటపడతాం
రైతుబంధు ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్​ నేతలు
దమ్ముంటే కేంద్రంతో కొట్లాడాలి
పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు
బీఆర్ఎస్ అధ్యక్షుడ ఆవేదన


హైదరాబాద్​:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడ, మాజీ సీఎం కేసీఆర్ తొలిసారి బహిరంగసభలో పాల్గొన్నారు. నల్గొండలో మంగళవారం నిర్వహించిన సభలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో విచక్షణ కోల్పోయి మంత్రులను బూతులు తిట్టారు. ‘‘కేసీఆర్ ఛలో న‌ల్గొండ అంటే కేసీఆర్‌ను తిరగ‌నివ్వం అని అంట‌రు. ఇంత మొగోళ్లా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వరా..?’’ అని ప్రశ్నించారు. పదేళ్లలో తెలంగాణకు తాము చేయాల్సిందంతా చేశాం.. అయినా ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం, తమకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని అన్నారు. ఏం పర్వాలేదని.. వెంటపడి మరీ సమస్యల పరిష్కారానికి కొట్లాడుతామని చెప్పారు. ఇచ్చిన హామీలు పక్కన బెట్టి కేవలం బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు. రెండు నెలలుగా కేసీఆర్‌ను రాష్ట్ర మంత్రులు తిట్టని రోజంటూ లేదన్నారు.
‘‘కనీసం రైతుబంధు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేత‌నైత‌ లేదు. ఇంత ద‌ద్దమ్మలా..? రైతుబంధు అడిగినోన్ని చెప్పుతో కొట్టమంటావా..? ఎన్ని గుండెల్రా మీకు..? ఎట్ల మాట్లాడుతారు.. కండ‌కావ‌ర‌మా..? కండ్లు నెత్తికి వ‌చ్చినాయా..? ప్రజ‌ల‌ను అలా అనొచ్చా..? పంట‌లు పండించే రైతుల‌కు కూడా చెప్పులుంటాయి. రైతుల చెప్పులు ఎట్ల ఉంట‌యి.. బందోబ‌స్తుగా ఉంటాయి.. గ‌ట్టిగా ఉంట‌యి.. ఒక్క చెప్పు దెబ్బతో మూడు ప‌ళ్లు ఊసిపోతాయి. ఇది మ‌ర్యాద‌నా.. గౌర‌వ‌మా..? ప్రజ‌ల‌ను గౌర‌వించే ప‌ద్ధతా..? చేత‌కాక‌పోతే చెప్పాలి.. కానీ, మట్లాడే పద్ధతి ఇదా? ” అని సీరియస్ అయ్యారు. ‘‘దమ్ముంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద కొట్లాడాలి.. అది మొగోడు చేయాల్సిన పని. ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డరో.. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నరు’’ అంటూ కేసీఆర్‌ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ‘ఆనాడు రాష్ట్రం కోసం కొట్లాడినం. ఆనాడు జలసాధన ఉద్యమంలో మండలానికో బ్రిగేడియర్‌ వచ్చి నెలపదిహేను రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేశాం.
ఎవరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకులు వందలకొద్ది కేసులు వేసినా పదేళ్లు పంటిబిగువున బాధను అణచుకుని.. కేంద్రంతో పోరాటం చేస్తూ ముందుకు తీసుకుపోయాం. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం వచ్చింది. వాళ్లకు వందల ఉత్తరాలు రాసినం. ట్రిబ్యునల్‌ వేయకపోతే సుప్రీంకోర్టుకు పోయాం. లోక్‌సభను స్తంభింపజేసినం. ఎంపీలకు ఏమైనా సరే కొట్లాడాలని చెబితే.. వారం రోజులు లోక్‌సభ జరుగనివ్వలేదు. అట్ల కొట్లాడినం. ఆ ఒత్తిడికి తలొగ్గి.. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్‌కు వేశారు. ట్రిబ్యునల్‌ ముందు గట్టిగా వాదించి.. మన వాటా ఇంత రావాలని కొట్లాడాలే. అది మొగోడు చేయాల్సిన పనని రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.

Spread the love

Related News

Latest News