-కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టారు
లక్ష ఎకరాలకు నీరు అందలేదు
-కోటి ఎకరాలకు నీరందించామని గొప్పలు
-ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్గొండ సభ
-ఏడాదికి కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులు రూ.10,500 కోట్లు
-మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై రేవంత్ రెడ్డి వివరణ
ప్రతిపక్షం, మహదేవపూర్:
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై ఇన్‌ఛార్జి చీఫ్
ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ పియర్లు కుంగాయని ఇంజినీర్లు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. లక్ష ఎకరాలకు నీరు అందక పోయినా.. కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పారని విమర్శించారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ.. సమస్యను చక్కదిద్దే పని చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు.
మేడిగడ్డను ఎవరూ చూడకుండా కేసీఆర్ కప్పిపుచ్చారు..
‘కుంగిన మేడిగడ్డను ఎవరూ చూడకుండా కేసీఆర్ కప్పిపుచ్చారు. అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్గొండలో సభ పెట్టారు. చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్ పదే పదే అంటున్నారు. అలా అని భావించే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు రెండుసార్లు అవకాశం ఇస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు. కాళేశ్వరంపై. శాసనసభ, ప్రజా కోర్టులో చర్చిద్దామని ఆహ్వానించాం. కాలు విరిగిందని శాసనసభకు రాలేని కేసీఆర్.. నల్గొండ సభకు ఎలా వెళ్లారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది. అడిగితే సలహాలు ఇస్తానన్న కేసీఆర్ ..కేఆర్‌ఎంబీపై చర్చ పెడితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు.
కుంగింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. తెలంగాణ ప్రజల నమ్మకం
రూ.వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కుంగితే చిన్న విషయంగా మాట్లాడుతున్నారు. ఏముంది చిన్న పిల్లర్లు కుంగాయని తేలికగా మాట్లాడుతున్నారు. కుంగింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. తెలంగాణ ప్రజల నమ్మకం. మేడిగడ్డపై సీబీఐ కంటే ఉన్నతమైన విచారణ కోరాం. న్యాయస్థానాలపై భాజపా నేతలకు నమ్మకం లేదా? . సాంకేతిక నిపుణులతోచర్చించాకే మేడిగడ్డ పునర్నిర్మాణంపై మా నిర్ణయం చెప్తాం. అక్రమాలకు బాధ్యులపై విచారణ కొనసాగుతోంది. అవసరమైతే రెవెన్యూ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తాం’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు ప్రాజెక్టును పరిశీలించిన వారిలో ఉన్నారు.