[t4b-ticker]

నీ చల్లని దీవెనలే.. కావాలమ్మా

ప్రతిపక్షం, ఆగస్టు 09: తెలంగాణలో బోనాల పండుగ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజలో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే ఆలయ పరిసరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

బోనాల వేడుకల్లో భాగంగా పలువురు ప్రముఖులు సైతం లాల్‌దర్వాజకు చేరుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో పాటు బీఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులు సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీ నటి వైష్ణవి చైతన్య కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

మరోవైపు అమ్మవారి దర్శనం కోసం ఆలయం వద్ద భక్తులు భారీగా క్యూలైన్లలో బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

బోనాల వేడుకల్లో భాగంగా పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ వేషధారణలో పోతురాజులు చేసిన నృత్యాలు, విన్యాసాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. డప్పు చప్పుళ్లు, అమ్మవారి నామస్మరణలతో లాల్‌దర్వాజ పరిసరాలు మార్మోగాయి.

అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, పండుగ వాతావరణం నెలకొంది.

Spread the love

Related News

Latest News