ప్రతిపక్షం, ఆగస్టు 14: సుమారు 200 ఏళ్ల క్రితం జన్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే సామాజిక న్యాయం, అంటరానితనం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మహిళలు చదువుకోవాలంటూ పెత్తందారీ వ్యవస్థను ఎదురించి, మహిళా అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలు కూడా చిరస్మరణీయమని పేర్కొన్నారు.
జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించుకోవడం సంతోషకరమని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోనున్నట్లు చెప్పారు. సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహనీయుల విగ్రహాలను రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి కృషి చేసిన మహనీయులను గౌరవించడం తెలంగాణ సమాజానికి గర్వకారణమని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
































