ప్రతిపక్షం, ఆగస్టు 22: హైదరాబాద్‌లో సంచలనం రేపిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. తనను ఉద్యోగం నుంచి తొలగించారనే కోపంతో ఓ మాజీ ఉద్యోగి తాను పనిచేసిన సంస్థకు చెందిన క్లయింట్ల క్రెడిట్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏకంగా 9 క్రెడిట్ కార్డులను ఉపయోగించి 386 మోసపూరిత లావాదేవీలు నిర్వహించి.. సుమారు రూ.1.64 కోట్ల మేర నష్టం కలిగించినట్లు ఫిర్యాదు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన రిషబ్ జగ్గీ 2025 జనవరిలో హైదరాబాద్‌లోని అక్యూబ్ బిజినెస్ అండ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో టికెటింగ్ ఏజెంట్‌గా చేరాడు. అయితే అతడి పనితీరు సంతృప్తికరంగా లేదని భావించిన సంస్థ యాజమాన్యం అదే ఏడాది మార్చిలో ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉద్యోగం కోల్పోయిన కొద్దిరోజులకే రిషబ్ సొంతంగా ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తాను గతంలో పనిచేసిన సంస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కంపెనీ భాగస్వామ్య సంస్థకు చెందిన వ్యక్తుల వద్ద ఉన్న 9 క్రెడిట్ కార్డుల వివరాలను అక్రమంగా సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఆ కార్డు వివరాలను ఉపయోగించి రిషబ్ వరుసగా మోసపూరిత లావాదేవీలు నిర్వహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 386 లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆ క్రెడిట్ కార్డుల ద్వారానే 70కి పైగా విమాన టికెట్లు బుక్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లావాదేవీల విలువ దాదాపు రూ.1.64 కోట్లుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
క్రెడిట్ కార్డులపై అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్న విషయం గుర్తించిన అనంతరం సంస్థ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. అక్యూబ్ సంస్థ డైరెక్టర్ చెరుకు అనిరుధ్ రెడ్డి ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్, సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మాజీ ఉద్యోగి నిజంగానే ఉద్యోగం నుంచి తొలగించారనే కోపంతో ఈ మోసానికి పాల్పడ్డాడా? లేక ముందుగానే క్రెడిట్ కార్డు వివరాలను సేకరించి మోసానికి ప్రణాళిక రచించాడా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. 386 లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలించడంతో పాటు బుక్ చేసిన విమాన టికెట్లు ఎవరెవరి పేర్లతో ఉన్నాయనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో సంస్థలలో ఉద్యోగుల వద్ద ఉండే క్లయింట్ల ఆర్థిక సమాచార భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్యోగులు సంస్థను వీడిన తర్వాత కూడా సున్నితమైన సమాచారం దుర్వినియోగం కాకుండా కంపెనీలు మరింత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు భారీ మొత్తంలో జరిగిన ఈ మోసానికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో సీసీఎస్ పోలీసులు నిమగ్నమయ్యారు.























