ప్రతిపక్షం, ఆగస్టు 22: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు సంధించారు. యూకే పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. అమెరికా పర్యటనకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం యూకే, అమెరికాలో పర్యటించి పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చలు జరపాలని నిర్ణయించింది. అయితే యూకే పర్యటనకు అనుమతి లభించినప్పటికీ.. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఈ పరిణామంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక మాధ్యమం వేదికగా కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూకే పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని నిలదీశారు. ముఖ్యమంత్రికి మినహా ప్రతినిధి బృందంలోని ఇతరులకు అనుమతి లభించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
అమెరికా పర్యటన విషయంలో కేంద్రం అనుమతి నిరాకరించడానికి అసలు కారణాలేమిటో వెల్లడించాలని ఆయన కోరారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలను గూఢచార సంస్థలు ముందుగానే గుర్తించాయా? గతంలో ఏవైనా అభ్యంతరకర పరిణామాలు చోటుచేసుకున్నాయా? రేవంత్ పర్యటన వల్ల దేశ భద్రతకు సంబంధించిన ఏదైనా సమస్య ఉందా? అనే ప్రశ్నలను ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లేవనెత్తారు.
అయితే ఇవి తన అనుమానాలేనని, కేంద్రం అనుమతి నిరాకరణకు వాస్తవ కారణాలను వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన వ్యాఖ్యల సారాంశంగా తెలుస్తోంది. సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
























