ప్రతిపక్షం, ఆగస్టు 26, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో ఆసక్తిని రెచ్చగొట్టి భారీగా డబ్బులు వసూలు చేసిన సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘25th August 2026’ పేరుతో ఒక ఖాతాను సృష్టించిన మోసగాళ్లు.. త్వరలో ఒక పెద్ద రహస్యాన్ని వెల్లడిస్తామని ప్రచారం చేశారు. దీంతో ఆ ఖాతాకు భారీగా అనుచరులు చేరారు.
మోసగాళ్లు చేసిన ప్రచారాన్ని నమ్మిన వారి సంఖ్య ఏకంగా 4.26 లక్షలకు పైగా చేరినట్లు సమాచారం. ఆ తర్వాత అసలు మోసం మొదలైంది. రహస్యాన్ని తెలుసుకోవాలంటే టెలిగ్రామ్‌లో ఇచ్చిన లింక్ ద్వారా డబ్బులు చెల్లించాలని సూచించారు. ఒక్కొక్కరి నుంచి రూ.502 వసూలు చేశారు.
రహస్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో సుమారు 1.66 లక్షల మంది డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కరి నుంచి వసూలు చేసిన మొత్తంతో మోసగాళ్లు ఏకంగా రూ.8.33 కోట్లకు పైగా సమీకరించినట్లు సమాచారం.
అయితే డబ్బులు చెల్లించిన వారికి చివరకు అసలు రహస్యం అంటూ ఎలాంటి సంచలన విషయాన్ని వెల్లడించలేదు. దాని బదులు ‘సమయం విలువైనది’ అనే సందేశంతో రూపొందించిన కృత్రిమ మేధస్సు వీడియోను చూపించినట్లు తెలుస్తోంది. దీంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంచలన ప్రకటనలను చూసి వెంటనే నమ్మి డబ్బులు చెల్లించవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టెలిగ్రామ్, ఇతర లింకుల ద్వారా డబ్బులు చెల్లించాలని కోరే ఖాతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.





























