ప్రతిపక్షం, ఆగస్టు 26, హైదరాబాద్: తెలంగాణలో భూ సమస్యలకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి విధానమే ప్రధాన కారణమని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రజా ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధానంగా భూములకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
గతంలో పటేల్–పట్వారి వ్యవస్థ ఉన్న సమయంలో భూ సమస్యలు తక్కువగా ఉండేవని వీహెచ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ధరణి విధానంతో అనేక కొత్త సమస్యలను తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములను కొందరు మళ్లీ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలు, తప్పిదాలపై రెవెన్యూ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్ సూచించారు. పేదలు, సామాన్యులు తమ భూములను కోల్పోకుండా ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని కోరారు.
ఇదిలా ఉండగా, వన్ నేషన్–వన్ ఎలక్షన్ విధానంపైనా వీహెచ్ తీవ్రంగా స్పందించారు. దేశంలోని భిన్న మతాలు, కులాలు, ప్రాంతాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానం భారత్‌కు సరిపోదని అభిప్రాయపడ్డారు. ఈ విధానానికి కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు.
కులగణన అంశాన్ని ప్రస్తావించిన వీహెచ్.. వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. కులగణనలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఎన్నికల విధానంలో మార్పుల గురించి మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్యకు, ఎన్నికల సంఘం లెక్కలకు మధ్య తేడాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.





























