ప్రతిపక్షం, ఆగస్టు 27: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఢిల్లీలో భేటీ అయినట్లు సమాచారం. బుధవారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ పరిస్థితులతో పాటు కొండా సురేఖ అంశంపై కూడా చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కొండా సురేఖ వ్యవహారంపై వ్యక్తమైన అభిప్రాయాలను భట్టి విక్రమార్క ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది. పార్టీకి ఇప్పటికే నష్టం జరిగిందని, ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి అందిన నివేదికను తాను కూడా పరిశీలించినట్లు ఖర్గే పేర్కొన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు, నేతల మధ్య నెలకొన్న విభేదాలపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.
మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే మరింత లోతుగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో సమావేశమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీ అధిష్ఠానం రాష్ట్ర నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.





























