ప్రతిపక్షం, జూన్ 13: హైదరాబాద్లో భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. వర్షాల కారణంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో 48 గంటల వ్యవధిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
మొన్న కురిసిన వర్షాలకు పాతబస్తీ ప్రాంతంలో విద్యుత్ తీగ తెగిపడటంతో ఇద్దరు మృతి చెందగా, తాజాగా అల్వాల్లో మరో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున విరిగిపడిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో తండ్రీకూతుళ్లు సందీప్, రితిక విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో సందీప్ భార్యకు గాయాలు అయినట్లు సమాచారం. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వరుస ప్రమాదాలతో నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
విద్యుత్ తీగల సమీపంలో ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

















