ప్రతిపక్షం, జూన్ 13: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య కొనసాగుతున్న విభేదాలు తాజాగా మరింత తీవ్రరూపం దాల్చాయి. పార్టీకి చెందిన నేతల మధ్య నెలకొన్న ఈ విభేదాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఇదిలా ఉండగా, షబ్బీర్ అలీపై వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పట్టణ నాయకులు తీవ్రంగా ఖండించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్ విడుదల చేసిన వీడియోలో షబ్బీర్ అలీ సేవలను ప్రస్తావిస్తూ ఆయన పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడ్డారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడు షబ్బీర్ అలీ అని కొనియాడారు.
పార్టీ అంతర్గత విషయాలను బయటకు తీసుకువచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని సందీప్ అన్నారు. కొందరు నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు కొనసాగితే తగిన రాజకీయ సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో జిల్లాలో ఈ తరహా వర్గపోరు బయటపడటం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు త్వరగా పరిష్కరించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో కామారెడ్డి కాంగ్రెస్‌లో నెలకొన్న ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో ఆసక్తిగా మారింది.

















