ప్రతిపక్షం, జూన్ 13: కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించిన వీబీజీ రాంజీ (VBG Ranji) పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కొత్త విధానంపై తమ నిరసనను అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశంపై తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త పథకం అమలుతో రాష్ట్రానికి, ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు కలిగే ప్రభావాలపై విస్తృతంగా చర్చించారు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధుల్లో కనీసం 60 శాతం కేంద్రం నుంచి అందుతున్నందున, కొత్త విధానాన్ని పూర్తిగా తిరస్కరించడం సాధ్యం కాదని అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, ఇతర రాష్ట్రాలు ఈ పథకంపై అనుసరిస్తున్న విధానాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. కొత్త పథకాన్ని అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ప్రస్తుత విధానంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిదినాలు కేటాయిస్తుండగా, కొత్త విధానంలో నార్మేటివ్ పద్ధతిలో పనిదినాలను నిర్ణయించడం వల్ల గ్రామీణ కార్మికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్‌లో 60 రోజులపాటు ఉపాధి హామీ పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనను కేంద్రం పునఃపరిశీలించాలని కోరారు.
వర్షాకాలంలోనే వనమహోత్సవాలు, మొక్కల నాటకం వంటి పర్యావరణ కార్యక్రమాలు ఉపాధి హామీ ద్వారా నిర్వహిస్తామని, అలాంటి సమయంలో 60 రోజుల విరామం ఇవ్వడం వల్ల గ్రీన్ ఇండియా లక్ష్యాలకు విఘాతం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆదివాసీ, కొండ ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్ స్వల్పకాలం మాత్రమే ఉంటుందని, అక్కడ ఈ నిబంధన అమలు చేయడం మరింత కష్టమని చెప్పారు.
ప్రస్తుత ఉపాధి హామీ విధానం నుంచి ఒక్కసారిగా కొత్త విధానానికి మారడం సాధ్యం కాదని, రాష్ట్రాలకు తగినంత సమయం, వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సీతక్క తెలిపారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త పథకం అమలు చేయాల్సి వచ్చినా, ఉపాధి కూలీలకు ఎలాంటి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అవసరమైతే కూలీలకు కలిగే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

















