ప్రతిపక్షం, ఆగస్టు 10: తెలంగాణకు అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదాపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ రాజ్యసభలో వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
జాతీయ ప్రాధాన్యత కలిగిన, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల అంశాలతో ముడిపడిన భారీ సాగునీటి ప్రాజెక్టులకు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదాను పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. అయితే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రస్తుతం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.
కృష్ణా జలాల వివాదమే కీలక అంశం
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక కేంద్ర జల సంఘానికి అందినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే ఈ పథకంలో కృష్ణా నదీ జలాల వినియోగంతో పాటు అంతర్రాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ఈ అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్నాయని తెలిపింది. దీంతో ప్రస్తుత దశలో ప్రాజెక్టుకు సాంకేతిక, ఆర్థిక పరిశీలన నిర్వహించడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది.
డీపీఆర్‌ను తెలంగాణకు తిప్పి పంపిన కేంద్రం
పాలమూరు–రంగారెడ్డి పథకం ద్వారా నిర్దేశించిన ప్రయోజనాలు పూర్తిగా సాధించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచిస్తూ ప్రాజెక్టు డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ఆర్థిక సహాయం కోసం ఏదైనా సాగునీటి ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ముందుగా కేంద్ర జల సంఘం సాంకేతిక పరిశీలన, అనంతరం సంబంధిత సలహా కమిటీ ద్వారా సాంకేతిక–ఆర్థిక మదింపు పూర్తికావాల్సి ఉంటుందని వివరించింది.
ప్రాజెక్టు ద్వారా ఏర్పడే సాగునీటి సామర్థ్యం, కరువు నివారణకు కలిగే ప్రయోజనాలు, తాగునీటి అవసరాలపై ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నించినప్పటికీ.. ఈ అంశాలపై కేంద్రం తన సమాధానంలో నిర్దిష్ట వివరాలు వెల్లడించలేదు. అలాగే ప్రాజెక్టుకు ఎంత మేర కేంద్ర ఆర్థిక సహాయం అందే అవకాశం ఉందనే అంశంపైనా స్పష్టత ఇవ్వలేదు.





























