[t4b-ticker]

మెదక్‌లో ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవ ర్యాలీ

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 26: మెదక్ జిల్లా కేంద్రంలో హజ్రత్ మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. భక్తిశ్రద్ధలు, శాంతి సందేశంతో నిర్వహించిన ఈ ర్యాలీకి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.జిలాని గడ్డ ప్రాంతం నుంచి ర్యాలీ ప్రారంభమై బిగ్ బజార్, చమన్, పోస్ట్ ఆఫీస్, ప్రధాన చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా కొనసాగి క్రిస్టల్ గార్డెన్ వద్ద ముగిసింది. ర్యాలీ సాగిన ప్రధాన మార్గాల్లో ప్రజలు ఆసక్తిగా తిలకించగా, నిర్వాహకులు శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు సిబ్బందిని మోహరించి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. ర్యాలీ మార్గంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ పోలీసు అధికారులు బందోబస్తును సమన్వయం చేశారు.

ఈ సందర్భంగా జామే మసీద్ ఇమామ్ సయ్యద్ ఖాజా మొయిజుద్దీన్. మౌలానా జావిద్ అలీ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త జీవిత విధానం, బోధనలు, మానవతా విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని వారు పేర్కొన్నారు. ప్రవక్త చూపిన శాంతి, ప్రేమ, సోదరభావం, కరుణ, సహనం, ఐక్యత వంటి సద్గుణాలను మన జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.ప్రవక్త మహమ్మద్ బోధనలు కేవలం ఒక సమాజానికే కాకుండా మానవాళికి మార్గదర్శకమని, ఆయన చూపిన సన్మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని, సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా సేవ చేయాలని సూచించారు.

ర్యాలీలో పాల్గొన్న వారు శాంతి, సోదరభావం, ఐక్యతను చాటుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన ర్యాలీ క్రిస్టల్ గార్డెన్ వద్ద ప్రశాంత వాతావరణంలో ముగిసింది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో నిర్వాహకులు, మత పెద్దలు, పోలీసు అధికారులు పాల్గొన్న ప్రతి ఒక్కరి సహకారం కీలకంగా నిలిచింది. శాంతి, సోదరభావం, ఐక్యత మరియు మానవతా సందేశాన్ని చాటుతూ ఘనంగా జరిగింది. ర్యాలీలో ఫాజిల్, అతిక్, మైసన్, మన్సూర్ కౌన్సిలర్, హైమద్ అలీ, సాదక్, జుబేర్, సయ్యద్ సాదాత్ అలీ, సిద్ధిక్, అక్బర్, షాహిద్, నాజర్ అలీ, మౌలానా అసలం రాజా, ఖాజా గౌస్, నజీర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News