[t4b-ticker]

ఆయిల్‌పామ్ సాగుకు భారీ ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యాచరణ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 26: తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును భారీగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వరి సాగుకు లాభదాయకమైన ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం, పంటకు మార్కెట్‌ భరోసా కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సూర్యాపేటలో సమగ్ర ఆయిల్‌పామ్ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటుపై రిలయన్స్ సంస్థ ఆసక్తి చూపుతోందని మంత్రి వెల్లడించారు.

కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల నుంచే ఆయిల్‌పామ్ విస్తరణకు మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కలుపుతూ భారీ ఆయిల్‌పామ్ కారిడార్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రైతుల నుంచి పంటను సేకరించడం నుంచి ప్రాసెసింగ్, పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ వరకు మొత్తం వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 3.12 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 65,691 మంది రైతులు ఈ సాగులో భాగస్వాములయ్యారని చెప్పారు. ఆయిల్‌పామ్ విస్తరణ కోసం ఇప్పటివరకు రూ.515.84 కోట్లను ఖర్చు చేసినట్లు వివరించారు. 2023 డిసెంబర్ తర్వాత కొత్తగా 1.29 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ప్రారంభమైనట్లు తెలిపారు. 2026-27 సంవత్సరంలో మరో 21,230 ఎకరాలకు సాగును విస్తరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 5,753 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని ఉత్తమ్ చెప్పారు. ఈ ప్రాంతంలో పంట విస్తీర్ణాన్ని మరింత పెంచడంతో పాటు భారీ స్థాయిలో ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన తాజా పండ్ల గుత్తుల లభ్యతపై రిలయన్స్ సంస్థ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. త్వరలో కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో ఆ సంస్థ ప్రతినిధులు పర్యటించనున్నారని తెలిపారు.

ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. తోటలు పూర్తిగా స్థిరపడిన తర్వాత దాదాపు 30 ఏళ్ల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఒకవైపు రైతులకు ఆదాయం పెరగడంతో పాటు మరోవైపు వరి సాగుతో పోలిస్తే సాగునీటి వినియోగంపై ఒత్తిడి తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు.

రైతులను వరి సాగు నుంచి ఆయిల్‌పామ్ వైపు మళ్లించాలంటే కేవలం పంట మార్పిడిని సూచించడం సరిపోదని, వారికి మెరుగైన ఆదాయం, కొనుగోలు భరోసా, మార్కెట్‌ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ అన్నారు. అందుకే ‘పొలం నుంచి పరిశ్రమ వరకు’ సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఆయిల్‌పామ్ ఆధారంగా వంటనూనెలతో పాటు సబ్బులు, ఇతర వినియోగ వస్తువుల తయారీకి భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణ ఆయిల్‌పామ్ కార్యక్రమంతో 14 కంపెనీలు అనుసంధానమై ఉన్నాయని మంత్రి తెలిపారు. పంట విస్తరణతో పాటు ప్రాసెసింగ్ పరిశ్రమలను కూడా అభివృద్ధి చేస్తే రైతులకు స్థానికంగానే మార్కెట్‌ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్‌పామ్‌కు డిమాండ్ పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని మరింత స్థిరీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

వరి కొనుగోలు, రవాణా, మిల్లింగ్, నిల్వ వంటి అంశాలపై ప్రభుత్వానికి పడుతున్న భారాన్ని తగ్గించడం కూడా ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో మరో ముఖ్య ఉద్దేశమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గిస్తూ రైతులకు స్థిరమైన ఆదాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

దేశంలో వంటనూనెల అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించడంలో తెలంగాణ కీలక పాత్ర పోషించగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు, ప్రాసెసింగ్ పరిశ్రమలు, అనుబంధ ఉత్పత్తుల తయారీని ఒకే వ్యవస్థగా అభివృద్ధి చేస్తే రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News