[t4b-ticker]

గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భవనం

ప్రతిపక్షం, ఆగస్టు 22: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో అక్కడి హాస్టల్‌లో ఉంటున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు.

ఈ ప్రమాదంలో భవనం శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తూ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

కాగా, నాలాను ఆనుకుని కేవలం 50 గజాల స్థలంలో ఈ భారీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నారా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత చిన్న స్థలంలో ఏడంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఎలా లభించాయనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

భవనం కూలిన సమయంలో చుట్టుపక్కల జనసంచారం ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో అక్కడి నివాసులు కూడా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? నిర్మాణంలో నిబంధనలు పాటించారా? అనే విషయాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.

ఈ ఘటన నేపథ్యంలో నాలాలు, ఇతర ప్రమాదకర ప్రాంతాలను ఆనుకుని చేపడుతున్న నిర్మాణాలపై అధికారులు కఠినంగా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ముందుగానే చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు మరింత ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News