ప్రతిపక్షం, ఆగస్టు 22: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ హెచ్1ఎన్1 వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆగస్టు 20 నాటికి ఢిల్లీలో మొత్తం 1,777 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రారంభంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి గణనీయంగా మారింది. గతంలో సుమారు 200 హెచ్1ఎన్1 కేసులు నమోదుకాగా, ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు ఎనిమిది రెట్లు పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆసుపత్రులకు వచ్చే రోగుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఓపీడీలకు వచ్చే రోగుల్లో ప్రతి 20 మందిలో దాదాపు 15 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నట్లు వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలో వైరస్ వ్యాప్తి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వైద్యులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం, వైద్యుల సూచనల మేరకు పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.




























