[t4b-ticker]

జీవో 150తో తెలంగాణ నీట్ విద్యార్థులకు అన్యాయం: కవిత

ప్రతిపక్షం, ఆగస్టు 21: బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను నీట్ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కలిసి తమ సమస్యలను వివరించారు. జీవో నంబర్ 150 కారణంగా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో 150పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కేవలం నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా పరిగణించడం రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు.

జీవో 150 కారణంగా వైద్య విద్యలో సుమారు 1,600 సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని కవిత ఆరోపించారు. తెలంగాణ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో ఇతరులకు సీట్లు కేటాయించడం సరికాదన్నారు.

జీవోను వెంటనే రద్దు చేయడం సాధ్యం కాకపోతే, కనీసం ఏడేళ్లు తెలంగాణలో చదివిన వారినే స్థానికులుగా పరిగణించేలా నిబంధనలను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే నీట్ విధానం వల్ల తెలంగాణ 15 శాతం సీట్లను కోల్పోతోందని అన్నారు.

ఈ అంశం అత్యంత కీలకమైనదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశాల్లో ఉన్నప్పటికీ వెంటనే స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అధికారులు కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.

Spread the love

Related News

Latest News