ప్రతిపక్షం, ఆగస్టు 27: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయిన ఇళ్లకు సంబంధించిన నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మార్చి 31వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయిన 15,475 ఇళ్లకు సంబంధించి రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిందని ఆయన వెల్లడించారు.
ఆ మొత్తాన్ని బుధవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని పొంగులేటి ఆరోపించారు. ఏడాది కాలంగా కేంద్రం నుంచి నిధులు విడుదల కాలేదని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి నిధులు రాకపోయినా ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు సంబంధించిన బిల్లులను పరిశీలించి నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా రూ.185 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడంతో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక భారం కొంత మేర తగ్గనుంది. మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.





























