రమజాన్ నెల ప్రారంభమైంది. ఉపవాసాల ప్రారంభ సూచకంగా మస్జిదులలో సైరన్ లు మారుమ్రోగాయి. మంగళవారం తెల్లవారుఝామున ముస్లిములు సహెరీ భుజించి ఉపవాసాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 14గంటల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా రోజంతా ఉపవాసం పాటించి అల్లాహ్ మెప్పు పొందడానికి నెలరోజుల ఉపవాసాలు పాటిస్తారు. ఉపవాసంలో ఉండి వుజూ చేసేటప్పుడు నోట్లో నీళ్లు తీసుకుని పుక్కిలించేటప్పు చుక్కనీరు కూడా గొంతులోకి పోనివ్వరు. భగభగమండే మండుటెండల్లో రోజేదార్ల కఠోర దీక్షదక్షతల వేడిని చూసి భానుడు సైతం ఓడిపోయాడని దైవదూతలు అల్లాహ్ కు చెప్పి మురిసిపోతారు. రమజాన్ నెలను ఇంత నిష్ఠగా గడుపుతారంటే ఆశ్చర్యమేస్తుంది!
రమజాన్ కు స్వాగతం!
రమజాన్ నెల రాబోతుందంటే చాలు నెల రోజుల ముందే స్వాగత సన్నాహకాలు చేసుకుంటారు ముస్లిములు. ఉపవాసాల కోసం మానసికంగా సన్నద్ధమవుతారు. సహెరీ, ఇఫ్తార్ల ఏర్పాట్లు, ఏ మస్జిదులో నమాజు చదవాలి? నెలసాంతం ఖుర్ఆన్ పారాయణం ఇలా అన్ని విషయాల్లో ప్రణాళికలు నెలరోజుల ముందే జరిగిపోతాయి. రమజాన్ నెలవంకను వీక్షించి మురిసిపోతారు. రమజాన్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. తరావీ నమాజుతో రమజాన్ కు స్వాగతం పలుకుతారు. హృదయాల్లో పేరుకుపోయిన దురాశ, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలన్నింటినీ తుడిచేసి తౌబా చేసుకుని ఒకరినొకరు క్షమించుకుని కల్మషం లేకుండా రమజాన్ గడపాలన్న ప్రవక్త సూక్తికి కట్టుబడతారు. ‘రమజాన్ నెల రాగానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి, నరక ద్వారాలు మూసుకుంటాయి. షైతాన్ బంధించబడతాడు.’ అన్న ముహమ్మద్ ప్రవక్త ప్రవచనానికి అనుగుణంగానే నెలవంక తొంగి చూడటంతోనే ముస్లిములు ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకుంటారు. ముస్లిమ్ బస్తీల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. సహెరీ, ఇఫ్తార్లతో ఎటుచూసినా వాతావరణం హృద్యంగా ఉంటుంది. రమజాన్ మాసాన్ని ఉలమాలు ఖుర్ఆన్ నెల అని, సానుభూతి చూపవలసిన మాసమని చెబుతారు. ఉపవాసాలతో పేదల ఆకలి బాధలు అనుభవంలోకి వచ్చి పేదలను ఆదుకునే స్ఫూర్తి మొలుస్తుంది.
రమజాన్ అంటే..
రమజాన్ అనేది రమజ్ అనే ధాతువు నుండి వచ్చింది అని ఉలమాలు చెబుతారు. రమజ్ అంటే కాల్చివేయడం అని అర్థం. అంటే అల్లాహ్ దాసుల పాపాలను భస్మీపటలం చేసి హృదయాలను మిలమిల మిరిసేలా చేస్తుంది. అందుకే రమజాన్ నెలలో చిన్న తప్పిదం మొదలు మహా పాపకార్యాలన్నింటినీ త్యజించి సత్కార్యాలకు పూనుకుంటారు. రోజంతా కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కఠోర ఉపవాస దీక్ష పాటిస్తారు. తెల్లవారు ఝామున సూర్యోదయానికి ముందే భుజించడాన్ని సహెరీ అంటారు. సహెరీ భుజించడాన్ని శుభంగా భావిస్తారు. సాయంత్రం రోజా విరమించడాన్ని ఇఫ్తార్ అంటారు.
సహెరీ తప్పనిసరి..
ఉపవాస దీక్ష ఫలప్రదమవ్వాలంటే సహెరీ భుజించడం తప్పనిసరి. అనివార్య కారణాలవల్ల తప్పితే సహెరీని వదలకూడదని ప్రవక్త ప్రబోధనం. ‘సహెరీ భుజించండి. సహెరీలో శుభముంది’ అన్ని ప్రవక్త సూక్తికి కట్టుబడి సహెరీ భుజించడం పుణ్యకార్యంగా భావిస్తారు. సహెరీ నుంచి మొదలు సాయంత్రం ఇఫ్తార్ వరకూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కఠోర ఉపవాస దీక్ష చేయడాన్ని అరబీలో సౌమ్ అంటారు. సౌమ్ అంటే ఆగిపోవడం అని అర్థం. కేవలం అన్నపానియాలు తినకుండా ఆగిపోవడమే కాదు, అన్ని రకాల చెడు పనులనుండి ఆగిపోవాలన్నది ఇందులో నిగూడార్థం. ‘ఉపవాసం ఢాలు వంటిది’ అని ప్రవక్త చెప్పారు. యుద్ధ మైదానంలో శత్రువునుంచి ఢాలు ఎలా రక్షిస్తుందో ఉపవాసికి రోజా (ఉపవాసం) అన్ని చెడు కార్యాలనుంచి కాపాడుతుందని ఉలమాలు చెబుతారు.
ఇఫ్తార్ చేయించడం పుణ్యకార్యం..
‘ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తే ఉపవాసం పాటించినంత పుణ్యం లభిస్తుంది. ఉపవాసాలు పాటించే శక్తి లేనివారు ఒక ఉపవాసానికి పరిహారంగా ఒక నిరుపేదకు భోజనం పెట్టాలి.’ ఈ బోధనలు నిరుపేదల పట్ల సానుభూతి చూపాలని బోధిస్తున్నాయి. అందుకే ఇఫ్తార్ వేళ ముస్లిములు ఉపవాస దీక్షకులకోసం విందుఏర్పాట్లు చేస్తారు. ఏమీ లేకపోతే కనీసం ఒక్క ఖర్జూరంతోనైనా ఉపవాసం చేయిస్తారు.
ఆ వాసన అల్లాహ్ కు ఎంతో ఇష్టం..
రోజంతా తిండితిప్పలు మానుకుని కనీసం లాలాజలాన్ని కూడా మింగకుండా ఉంటే నోట్లో దుర్వాసన రావడం సహజం. ఆ దుర్వాసనను సహజంగా ఎవరైనా అసహ్యించుకుంటారు. కానీ అల్లాహ్ కు ఆ దుర్వాసన అంటే ఎంతో ఇష్టం. ఆ వాసన అల్లాహ్ కు కస్తూరి సువాసన కన్నా ప్రీతికరమని ప్రవక్త ప్రవచనాలు చెబుతున్నాయి. ఉపవాసాలు ఎవరు పాటించాలి.. యుక్తవయస్సుకు వచ్చిన స్త్రీ, పురుషులంతా ఉపవాసాలు పాటించాలన్నది ఖుర్ఆన్ లో అల్లాహ్ ఆదేశం. బలమైన కారణం లేకుండా ఒక్క ఉపవాసం మానుకుంటే జీవితాంతం ఉపవాసం ఉన్నా సరితూగలేదు.
వీళ్లకు మినహాయింపు..
ప్రయాణంలో ఉన్నవారు, అతి వృద్ధులు, మతిస్థిమితం లేనివారు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అశుద్ధావస్థలో ఉన్న స్త్రీలు మినహాయించబడ్డారు. బాలింతలు, గర్భీణీలు, అశుద్ధావస్థలో ఉన్న స్త్రీలు, ప్రయాణీకులు మాత్రం తప్పిపోయిన ఉపవాసాలను మిగతా రోజుల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
ఖర్జూరంతో ఉపవాస విరమణ..
ముహమ్మద్ ప్రవక్త (స) ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించేవారు. రోజంతా ఉపవాసం పాటించి కోల్పోయిన శక్తిని ఖర్జూరం అందజేస్తుంది. అలసటను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఇఫ్తార్ వేళ ఎదుటి వారికి ప్రాధాన్యమిచ్చే అలవాటు అలవడుతుంది. తరతమ భేదం లేకుండా పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఒకరినొకరు పంచుకుని తినే భావన అలవడుతుంది.
ఖుర్ ఆన్ శ్రవణం.. పారాయణం..
పవిత్ర ఖురాను అవతరించిన నెల రమజాను నెల. మానవులందరికీ (ఆ గ్రంథం) మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రమజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి.
(ఖుర్ఆన్ 2:185)
పై ఖుర్ఆన్ ప్రకారం.. రమజాన్ నెలలో ఖుర్ఆన్ అవతరించినందుకు ఈ నెలకు ఇంత ప్రాశస్త్యం. అందుకే ఈ నెలలో ఖుర్ఆన్ పారాయణం, శ్రవణం విధిగా చేస్తారు. తరావీహ్ ప్రత్యేక నమాజులో ఖుర్ఆన్ శ్రవణంతో తరిస్తారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఒక్కసారైనా కనీసం పూర్తి ఖుర్ఆన్ వినాలన్న నిబంధనను తూ.చ.తప్పకుండా పాటిస్తారు. ఈ రమజాన్ శుభాలను చేజారకుండా ప్రతీ ముస్లిమ్ తగినంత శ్రద్ధాభక్తులతో రమజాన్ ఘడియలను గడుపుతారు!
- ముహమ్మద్ ముజాహిద్,
(9640622076)