Trending Now

నేడు మహాకవి శ్రీశ్రీ వర్ధంతి..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. నేడు ఆ మహాకవి వర్థంతి.

శ్రీశ్రీ సినీగేయ ప్రస్థానం..

శ్రీశ్రీ సినిమా పాటకు శ్రీకారం చుట్టడం, మహాప్రస్థానం గ్రంథరూపంలో వెలువడ్డం– రెండూ 1950లోనే కావడం యాదృచ్ఛికం. ఆహుతి డబ్బింగ్‌ చిత్రంతోనే శ్రీశ్రీ సినీ వ్యాసంగం ప్రారంభమైంది. నీరా ఔర్‌ నందా హిందీ చిత్రానికి తెలుగు సేత అయిన ఆ చిత్రంలోని 9 పాటలనూ శ్రీశ్రీయే రాశారు. వాటిలో మొదటిదైన ‘ప్రేమయే జనన మరణ లీల’ అనేది తన ప్రథమ గీతమని శ్రీశ్రీ స్వయంగా పేర్కొన్నారు. శ్రీశ్రీ సుమారు 200 స్ట్రెయిట్‌ చిత్రాలకు, 80 డబ్బింగ్‌ చిత్రాలకు కలిపి దాదాపు వెయ్యి పాటలు రాసారు.

శ్రీశ్రీ సాహిత్యానికి ఎన్నో అవార్డులు..

శ్రీశ్రీ సాహిత్యాన్ని గుర్తించిన సాహిత్య అకాడమీ 1972లో ఆయన్ని అవార్డుతో సత్కరించింది. 1974లో ‘తెలుగు వీర లేవరా’ అంటూ తెలుగు సినిమా పాటకు తొలి జాతీయ పురస్కారం తీసుకువచ్చారు శ్రీశ్రీ. నేటి భారతం సినిమాలో ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం అంధకార బంధురం’ అంటూ శ్రీశ్రీ ఓ గీతం రాశారు. దానికి నంది అవార్డు వచ్చింది. ‘కన్యాదానం’ చిత్రం కోసం మైసూరులో ఉండి ఒక్కరోజులో 12 పాటలు శ్రీశ్రీ రాశారు. ఇది ప్రపంచ చలనచిత్రలోకంలో ఒక రికార్డు.

Spread the love

Related News

Latest News