కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 14 : ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ దేనని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో అన్ని వర్గాల నుంచి తన ప్రచారానికి విశేష స్పందన లభించడమే కాకుండా పోలింగ్ రోజు కూడా ఆ స్థాయి గౌరవం దక్కిందని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా తనకోసం కష్టపడ్డ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పలు విషయాలు తెలియజేశారు. తనకు మనోధైర్యాన్నిచ్చి పార్లమెంట్ ఎన్నికల సమయంలో తోడు, నీడగా నిలిచిన ప్రతి ఒక్కరు ఎంపీగా గెలిచినా తర్వాత కూడా అదే మాదిరి సహాయ, సహకారాలు సలహాలు అందజేసి జిల్లా అభివృద్ధికి కూడా నిలవాలని కోరారు. ఆదిలాబాద్, (కొమురం భీం) ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, ముధోల్, సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల అన్ని వర్గాల ప్రజలకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.