కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ నాయకులను కోరిన బండి సంజయ్
ప్రతిపక్షం, కరీంనగర్, మే 7: కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు అందించిన సహకారంతోనే అలుపెరగని పోరాటాలు చేసి ఈ స్థాయికి ఎదిగానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ చెప్పారు. అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసి అరెస్టైనప్పుడుల్లా తనకు బెయిల్ ఇప్పించి ప్రోత్సహించిన న్యాయవాదులందరికీ ఈ సందర్భంగా బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం కరీంనగర్ జిల్లా న్యాయస్థానం వద్ద బార్ అసోయేషన్ నాయకులను కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కోర్టు వద్దకు వస్తే.. తాను అరెస్టయి బెయిల్ కోసం వచ్చినట్లుగా ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘మీరు తయారు చేసిన బిడ్డను. కరీంనగర్ లోని ప్రతి చౌరస్తాలో కొట్లాడిన వ్యక్తి. నేనే ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి అరెస్ట్ చేసినప్పుడల్లా బెయిల్ ఇప్పిస్తూ అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఎంపీగా 5 ఏళ్లలో రూ.12 వేల కోట్లు తెచ్చిన. అందులో రెండేళ్ల కాలం కరోనాతో వృధా అయ్యింది. అయినప్పటికీ రూ.5 వేల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టిన. కరీంనగర్ ఆర్వోబీకి కేంద్రం నుండి పూర్తి స్థాయిలో నిధులు తీసుకొచ్చిన. తెలంగాణలోనే అత్యధికంగా సీఆర్ఐఎఫ్ నిధులను తీసుకొచ్చి రోడ్లు నిర్మిస్తున్న. శాతవాహన వర్శిటీకి 12 బి హోదా, ఎస్సారార్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీకి అటానమస్ హోదా తీసుకొచ్చిన. రూ.20 కోట్లో సీఐటీడీ భవనాన్ని నిర్మిస్తున్నం. రైల్వే స్టేషన్ ను ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి’’అని వివరించారు. గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య జరుగుతున్న పోరులో మీరంతా తనకు మద్దతిచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.