రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. సొంతగడ్డపై పాకిస్తాన్‌ను పది వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగానూ రికార్డు సృష్టించింది. అంతేకాదు, టెస్ట్ క్రికెట్లో పాక్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన బంగ్లా జట్టు.. పాక్ గడ్డపై 10 వికెట్ల తేడాతో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగానూ రికార్డు సృష్టించింది. ఓవర్‌నైట్ స్కోరు 23/1తో ఐదో రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 146 పరుగులకే (55.5 ఓవర్లలో) ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లలో ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ (37), వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (51) మాత్రమే రాణించారు. బాబర్ అజామ్ (22), షాన్ మసూద్ (14) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లు మెహదీ హసన్ మిరాజ్ (4/21), షకీబ్ అల్ హసన్ (3/44) పాక్‌ను దెబ్బకొట్టారు. షోరిపుల్ ఇస్లామ్, హసన్ మహమూద్, నిహిద్ రాణా తలో వికెట్ పడగొట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 448/6 రన్స్‌కి డిక్లేర్ ఇచ్చిన విషయం తెలిసిందే.