ప్రతిపక్షం, నేషనల్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కేసులో కర్ణాటకలోని బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జయలలితకు సంబంధించిన 27 కిలోల బంగారం, వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చి 6,7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. నిర్దేశించిన తేదీల్లో ఆభరణాలను తీసుకెళ్లడానికి ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
బంగారం, వజ్రాభరణాలతో పాటు మొత్తం 700 కిలోల కంటే ఎక్కువ వెండిని కూడా ప్రభుత్వానికి అప్పగించనుంది. వీటిని తీసుకెళ్లేందుకు ఒక అధికారిని నియమించినట్టు కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ అధికారితో సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు స్థానిక పోలీసులతో భద్రతా ఏర్పాటు చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది.