మొయినాబాద్‌లో బీజేపీ నిరసన

  • ఉప తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన నాయకులు.
  • హామీల అమల్లో సర్కారు విఫలం.
  • చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం.

  • ప్రతిపక్షం, మొయినాబాద్‌, మార్చి 18 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం బీజేపీ శ్రేణులు మొయినాబాద్‌లో గర్జించాయి. మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.రత్నం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత మండల కేంద్రంలో ధర్నా నిర్వహించిన అనంతరం, ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ఉప తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
    ఈ సందర్భంగా కె.ఎస్‌.రత్నం మాట్లాడుతూ.. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, నేటికీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు న్యాయం చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ వంటి కీలక హామీల విషయంలో రైతులను విస్మరించారని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు అందాల్సిన రూ. 2,500 నగదు ఊసే లేదని, గృహజ్యోతి పథకం అమలులోనూ కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు.
    పోరాటం ఆపే ప్రసక్తే లేదు..
    అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని రత్నం స్పష్టం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఆచరణలో హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు, వివిధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News