ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 23 : అదిలాబాద్‌లో బుధవారం జరగబోయే నామినేషన్ మహోత్సవానికి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్.. నామినేషన్ ర్యాలీ కోసం పట్టణంలోని రాంలీల మైదానం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, పార్లమెంట్ ఇంచార్జ్ పాయల శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రేపు రాంలీల మైదానం నుండి ఉదయం 10 గంటలకు నామినేషన్ మహోత్సవ ర్యాలీ ప్రారంభమవుతుందని, ఈ నామినేషన్ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి శివశంకర్, ఓబీసీ జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ తదితరులు హాజరవుతారని, పార్లమెంట్ నియోజకవర్గ నలుమూలల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, పార్లమెంట్ ఇంచార్జ్, ఎమ్మెల్యే పాయల శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో ఇంచార్జ్ అశోక్ ముస్తాపురే, స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.