ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 6: హుస్నాబాద్ బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హుస్నాబాద్ నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులతో కలిసి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న బొమ్మ శ్రీరామ్ రాజకీయ కారణాలతో బీజేపీలో చేరారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడైన బొమ్మ శ్రీరామ్.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డ్ సొసైటీ చైర్మన్ గా పనిచేశారు. కొన్ని రోజులు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా చేపట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి రాకతో విభేదించి బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీలో నియోజకవర్గ ఇన్చార్జిగా రాష్ట్ర కార్యదర్శిగా సభ్యునిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ పొన్నం ప్రభాకర్ పిలుపుమేరకు ఏఐసీసీ ఇంచార్జ్ సెక్రటరీ రోహిత్ చౌదరి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, సమక్షంలో సొంతగూటికి తన అనుచరులతొ కలిసి చేరారు. ఈ కార్యక్రమంలో కోమటి సత్యనారాయణ, అక్కు శ్రీనివాస్, నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.