ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోరుతూ ఆమె వేసిన పిటిషన్లను ట్రయల్ కొట్టేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులను సవాల్ చేస్తూ.. కవిత విడి విడిగా బెయిల్‌పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిగింది. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్నారు. చివరకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చారు. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై జ్యూడీషియల్ రిమాండ్ కింద తీహార్ జైల్లో ఉన్న కవితను.. సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి అక్రమార్జన చేశారని కవితపై అభియోగాలు నమోదు చేశాయి ఇరు దర్యాప్తు సంస్థలు.