ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో భూ వివాదం చోటుచేసుకుంది. గుర్లపేట ప్రాంతంలో ఉన్న తమ సొంత భూమి విషయంలో కొంతమంది పదేపదే తమను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని భూ యజమానులు నిర్మల్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం గుర్లపేట కాలానికి చెందిన పూల పోశెట్టి లింగన్న, చంద్రశేఖర్‌లకు సొంత పట్ట భూమి ఉంది. అయితే కొంతమంది తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించుకుని ఆ భూమి విషయమై భూ యజమానులపై గత కొంతకాలంగా బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఆ భూ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, గతంలో కూడా బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. కొంతమంది సంఘం, కులం పేరిట నగదును భూపట్టాదారుల నుంచి పొంది కూడా మళ్లీ అదే మాదిరి బెదిరింపులకు పాల్పడడంతో పాటు డబ్బులను డిమాండ్ చేస్తూ తీవ్ర మానసిక శోభకు గురి చేస్తున్నారని తెలిపారు.