ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని.. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటామన్నారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్‌లా మారుస్తామని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని.. వైజాగ్‌లో ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
విశాఖలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ డెవలప్ మెంట్ డైలాగ్ సదస్సులో సీఎం జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు 90 శాతం హైదరాబాద్‌కే పరిమితమయ్యాయన్నారు. అద్భుతమైన ప్రగతి సాధించిన హైదరాబాద్‌ను రాష్ట్ర విభజనతో వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ర్ట జీఎస్‌డీపీలో సర్వీస్ సెక్టార్ తెలంగాణలో 62 శాతం ఉండగా, ఆంధ్ర ప్రదేశ్‌లో 40 శాతం మాత్రమే ఉందన్నారు. తలసరి ఆదాయం కూడా తెలంగాణ లో 3.12 లక్షలు ఉంటే ఏపీ లో 2.9 లక్షలు మాత్రమే ఉందన్నారు.