నిర్మల్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి మరణంతో తీవ్ర కలత చెందిన ఓ కుమారుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఇవాళ తెల్లవారుజామున తండ్రి మరణించగా, తీవ్ర మనోవేదనకు గురైన కుమారుడు ఏడుస్తూ ఏడుస్తూ.. క్షణాలలోనే గుండెపోటుతో అకాల మరణం చెందాడు. గంటల వ్యవధిలోనే తండ్రీకొడుకులిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికులతో పాటు అందరి హృదయాలను తీవ్రంగా కలిచివేసింది.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అస్రా కాలనీలో నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి జహుర్ అలీ ఖాన్ (74), ఆయన కుమారుడు ఆబీద్ అలీ ఖాన్ (52) ఆదివారం ఉదయం మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జహుర్ అలీ ఖాన్ ఆదివారం తెల్లవారు జామున ఐదున్నర గంటలకు మరణించారు. తండ్రి మరణ వార్త విన్న కొడుకు ఆబీద్ అలీ ఖాన్ కన్నీళ్ల పర్యంతమవుతూ.. ఆ వార్తను బంధుమిత్రులకు తెలియజేస్తూనే ఒక్కసారి కుప్పకూలిపోయాడు. వెంటనే పట్టణంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆయన అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ వీధిలో తీవ్ర విషాదం అలుముకుంది. మధ్యాహ్నం నిర్మల్ మంజులాపూర్‌లోని ముస్లింల ఖబ్రస్తాన్‌లో అంతిమ సంస్కారాలు ఉంటాయని మృతుడి సోదరుడు తెలిపారు.