ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ నుంచి తరలిపోతున్నపెట్టుబడులపై మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలం అవుతుందన్న అవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్నకేన్స్ సెమికాన్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్ కి తరలిపోతున్నట్లు వచ్చిన వార్తలపైన కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కంపెనీ గతంలో కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించామన్నారు. కంపెనీ కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ పరిశ్రమకు దగ్గరగా భూమి కేటాయింపు కావాలంటే, కేవలం పది రోజుల లోపే అవసరమైన భూమిని కేటాయించి, కంపెనీని ఒప్పించగలిగినట్లు కేటీఆర్ తెలిపారు.
అయితే ఇప్పుడు ఇదే కంపెనీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ నుంచి గుజరాత్ కి తమ పెట్టుబడులను తరలిస్తున్నట్లు వచ్చిన వార్తల పైన కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందించారు. ఈ కంపెనీ OSAT యూనిట్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంతో పాటు, సెమీ కండక్టర్ పరిశ్రమ ఈకో సిస్టమ్ కి అత్యంత కీలకమైనదని, ఈ పరిశ్రమ వస్తే ఈ రెండు రంగాల్లో తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి.. చర్చలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోనే తమ పెట్టుబడులను కొనసాగించేటట్లు ఒప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.