ప్రతిపక్షం, హుస్నాబాద్ ఏప్రిల్ 6: అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతులకు మద్దతుగా నిర్వహిస్తున్న రైతు దీక్షలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు. అన్నదాతల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయం చేయడం తప్ప, రైతులకు అండగా నిలబడటంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
పంట నష్టపోయిన రైతులను పొలాల్లోకి అధికారులు గానీ, మంత్రులు గానీ చూసిన పాపాన పోలేదని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ విమర్శించారు. రైతులు పండించిన ప్రతి పంటకు క్వింటాలుకు ఐదు వందల రూపాయలు బొనస్ ఇవ్వాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వాలని రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో 220 మంది రైతులు చనిపోయారని ప్రతీ రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్సగ్రెషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇక్కడి మంత్రికి చిత్తశుద్ధి ఉంటే రైతులపై ప్రేమ ఉంటే కాలేశ్వరం మిడ్ మానేరు నుండి గౌరవెల్లి ప్రాజెక్టు లోకి నీళ్లు తీసుకురావాలని కనీసం ప్రాజెక్టు ద్వారానైనా భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా భీమదేవరపల్లి ఎల్కతూర్తి మండలాలకు నీళ్లు అందించాలని మిడ్ మానేరు నుండి చిగురుమామిడి సైదాపూర్ మండలాలకు నీళ్లు అందించాలని కోరారు మమ్ముటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అన్నారు. రైతులను ఆదుకునే దాకా వదిలిపెట్టేదే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వెంకన్న, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ ఎడబోయిన రజిని, తిరుపతిరెడ్డి, ఆక్కనపేట ఎంపీపీ మాలోతు లక్ష్మీ, బీలు నాయక్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, కౌన్సిలర్ వాళ్ల సుప్రజ, పార్టీ పట్టణ రూరల్ అధ్యక్షులు ఎండి అన్వర్, గంగం మధుసూదన్ రెడ్డి, నాయకులు వంగ వెంకట్రామిరెడ్డి, చిట్టి గోపాల్ రెడ్డి, నియోజకవర్గంలోని ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.