Gas cylinder on railway track: రైళ్లను పట్టాలు తప్పించి, ప్రమాదాలకు గురిచేసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నాయి. తాజాగా రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్‌ను అమర్చిన ఘటన ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకొంది. ప్రేమ్‌పుర్ రైల్వే స్టేషన్ సమీపలో దిల్లీ-హౌరా రైలుపై దీనిని గుర్తించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ , రైల్వే పోలీసులు అక్కడకి చేరుకుని పరిశీలిస్తున్నారు. పట్టాలపై ప్రమాదాన్ని గుర్తించే సమయానికి లూప్‌లైన్‌లో కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఒక గూడ్స్ రైలు వెళుతోంది. ఒక ఎక్స్‌ప్రెస్ రైలుకు దారి ఇచ్చే క్రమంలో దాని ఆపాల్సి వచ్చింది. అప్పుడు లోకోపైలట్ సిలిండర్‌ను గమనించి తక్షణమే అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా.. ఒక్క ఆగస్టు నుంచే ఈ తరహా 18 ఘటనలు వెలుగుచూశాయని రైల్వేశాఖ తెలిపింది. ఇప్పటికే వీటిపై దర్యాప్తును తీవ్రం చేశామని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.