నకిలీ విత్తన అక్రమార్కులపై పీడీ యాక్ట్ అమలు..
జిల్లా ఎస్పీ జానకి షర్మిల..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 21 : వ్యవసాయ సంబంధిత విత్తనాల దుకాణాల క్రయ విక్రయాలపై ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తామని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలు, కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలు అని చెప్పి రైతులకు అమ్మడం తీరా అవి సరైన దిగుబడి రాక రైతులు పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారని తెలిపారు. రైతులు నకిలీ, కల్తీ విత్తన ముఠాల బారిన పడకుండా మేలు రకం విత్తనాలు విక్రయించే విధంగా నకిలీ, కల్తీ విత్తనాలు స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ దేశాల మేరకు కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.నకిలీ విత్తనాలను అరికట్టేందుకు నిర్మల్ జిల్లా పరిధిలో పోలీసు అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు.
వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేయడం జరుగుతుందని చెప్పారు. వారిని అరికట్టడం లో భాగంగా పోలీస్ శాఖ వారు ప్రత్యేక శ్రద్ధతో రైతులను మోసం చేసే, నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై నిఘా ఏర్పాటు చేసి సమాచారం సేకరించి వారిపై కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిధి లోగల విత్తన, ఎరువుల దుకాణాలను, గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీలు, అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్షలకు పంపించడం, రవాణా వాహనాలను కూడా ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని అన్నారు. లైసెన్స్ లు లేకుండా వ్యాపారం చేసే వారిపై, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కూడా కేసులు కూడా నమోదు చేయాలని అధికారులకు ఆదేశాల జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ రవాణాను జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు.నకిలీ, కల్తీ విత్తనాల అక్రమ రవాణాను, సరఫరా నిరోధించేందుకు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగిందని పేర్కొన్నారు. నకిలీ విత్తన అక్రమార్కులపై పీడియాక్ట్ అమలు చేయడం జరుగుతుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.