హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటనలో కారు టైర్ పేలడంతో పెద్ద శబ్ధం రావడంతో భద్రతాధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యలో మన్నెగూడ చౌరస్తా దగ్గర సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది. మరోవైపు.. సీఎం భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌ను సిబ్బంది పిలిపించారు. ఈ ఘటన జరిగాక ఈ ఒక్క కారు తప్ప మిగిలిన వాహనాలతో రేవంత్ కొడంగల్‌కు చేరుకున్నారు. కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. మండలాల వారిగా ముఖ్యనేతలతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు.