ప్రతిపక్షం, వెబ్ డెస్క్: జై భారత్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ పూర్వ జె.డి. వి.వి.లక్ష్మీనారాయణ కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు. ఎంవీపీకాలనీ సెక్టారు-10లోని ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంటు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన పోయిందని.. చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవటం లేదన్నారు.
విశాఖ నగరంలో లక్ష్మీనారాయణ పోటీ చేయటం ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, లక్ష్మీనారాయణ కేవలం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారా.. ఎంపీగానూ బరిలో నిలుస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఈసీ కేటాయించింది. 2019 ఎన్నికల్లో లక్ష్మీనారాయణ జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి.. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే.