హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. 2028లో తాను తెలంగాణ ముఖ్యమంత్రిని నేనే అవుతానంటూ చెప్పారు. ఈ విషయం రాసిపెట్టుకోవాలంటూ మీడియాకు చెప్పారు. సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాటెపల్లి 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడకపోతే తన ముఖం ఎవరికి చూపించబోనని శపథం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆహ్వానించడం పట్ల కాటిపల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. అదనపు గదుల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేనైన తనకు ఆహ్వానం ఉండదా అంటూ ప్రశ్నించారు. కామారెడ్డి నుంచి పారిపోయి ఓడిపోయిన వ్యక్తితో ప్రారంభోత్సవం ఎలా చేయిస్తారని కాటిపల్లి నిలదీశారు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రారంభోత్సవానికి మిగతా ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేకపోగా.. ప్రభుత్వ సలహాదారు వచ్చి రిబ్బన్ కట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రిని అవుతానని.. వీలైతే తానుకూడా తన గర్ల్ ఫ్రెండ్ కి క్యాబినెట్ హోదా ఇస్తానంటూ పరోక్షంగా రేవంత్‌ను ఉద్దేశించి కాటిపల్లి కామెంట్స్ చేశారు. 2028లో సీఎం కావాలని పక్కా ప్లాన్‌తో ఉన్నానని.. పక్కాగా అవుతానన్నారు. ఈ విషయంపై ఛాలెంజ్ సైతం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాటిపల్లి.. ప్రస్తుత సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌లను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.