KTR Sensational Tweet On Congress: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం విచారణ కోసం మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, విచారణను హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్‌కు కమిషన్ సభ్యులు రాఖీ కట్టడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి..మహిళా కమిషన్ కార్యాలయంలోనే రాఖీలు కట్టడంపై మహిళా చైర్ పర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా కమిషన్ కార్యాలయంలో రాఖీ కట్టడంపై ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే లీగల్ ఓపీనియన్ తర్వాత కమిషన్ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం చేశారు. ఈ తరుణంలో మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేశారు. రాఖీలు కట్టిన చేతిని చూపిస్తూ.. ‘రాఖీకి కూడా భయపడితే ఎలా?’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.