ప్రతిపక్షం, స్టేట్బ్యూరో: తూనికలు, కొలతలశాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సింగబోయిన ఉమారాణితోపాటు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డి. మల్లేశం రూ.10 వేలు లంచం తీసుకుంటూ దొరికారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఉన్న నాట్కో ఫార్మా లిమిటెడ్ కు చెందిన వేయింగ్ మెషిన్స్(బరువు కొలిచే యంత్రాలు)కు స్టాంపింగ్ వేసేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు.
ఒక్కో యంత్రానికి రూ.400 చొప్పున 25 యంత్రాలకు 10 వేలు ఇవ్వాలని, లేకుంటే స్టాంపింగ్ చేసేదిలేదని యంత్రాలకు స్టాంపింగ్ కోసం తీసుకువచ్చిన గిరిధర్ రావుకు ఇన్స్పెక్టర్ చెప్పారు. చెప్పిన మొత్తాన్ని టెక్నికల్ అసిస్టెంట్ కు ఇవ్వాలని సూచించారు. దీంతో చేసేదేమి లేక బాధితుడు గిరిధర్ రావు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డబ్బులు తీసుకుంటుండగా వలపన్ని మల్లేశంను పట్టుకుంది. అనంతరం ఉమారాణితోపాటు మల్లేశం ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.