80 అసెంబ్లీ సీట్లు, సీఎం పదవి అడగాల్సింది..
ప్రతిపక్షం, ఏపీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడిగి ఉండాల్సిందని అన్నారు. ఆ సాహసం మీరు చేయకపోవడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి మీరే కారకులు అని తెలిపారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదు, రాకూడదని దేవుని కోరుకుంటున్నానని ముద్రగడ లేఖలో వివరించారు.
చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడరు బయటకు రావడానికి భయపడి ఇళ్ళకే పరిమితం అయిపోయారన్నారు. అటువంటి కష్టకాలంలో జైలుకి వెళ్ళి వారికి భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదన్నారు. చరిత్ర తిరగరాసినట్టు అయ్యింది. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనన్నారు. ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మలను ఉన్నత స్థానంలో చూడాలని తహతహాలాడారన్నారు.
‘2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారండి. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్దపడ్డానండి. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను కాని దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదండి’ అని ముద్రగడ పద్మనాభం తన లేఖలో రాశారు.