తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్..!
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలు ముదరడంతో ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు భానుడు భగభగ మండుతున్నారు. వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగనున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి29 నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరగవచ్చని తెల్పింది. ముఖ్యంగా ఆదిలాబా ద్, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లిలకు బుధవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మార్చి 30న అధిక ఉష్ణోగ్రతలతోపాటు వేడిగాలులు కొనసాగుతాయని వెల్లడించింది. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నారాయణపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.