ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో, జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలనలో ఉరితీయబడ్డాడు. రాజకీయ నాయకుడి హత్యకు కుట్ర చేశాడనే అభియోగాలపై 1979లో లాహోర్ హైకోర్టు భుట్టోకి మరణశిక్ష విధించింది. సైనిక తిరుగుబాటుకు పాల్పడి భుట్టోని అధికారంలో నుంచి దించిన జియా ఉల్ హక్ అతనిపై అవినీతి ఆరోపణలు, ఇతర అభియోగాలు మోపాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పాకిస్తాన్ న్యాయవ్యవస్థ సరిగా పనిచేయలేదనే భావన ఉంది.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మరణశిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. పాక్ పార్లమెంట్లో బుధవారం ఒక తీర్మానం ఆమోదించబడింది. మాజీ ప్రధాని న్యాయవిచారణ సరిగా జరగలేదని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా అభిప్రాయపడిన కొన్ని రోజుల తర్వాత ఈ తీర్మానం ఆమోదించబడింది. మార్చి 18, 1978న, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన అహ్మద్ రెజా కసూరిని హత్య చేయాలని ఆదేశించినందుకు జుల్ఫికర్ అలీ భుట్టోకు లాహోర్ హైకోర్టు మరణశిక్ష విధించింది.